What generation are you?

What generation are you

What generation are you | మీరు ఏ జనరేషన్ ?

ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం Gen Z. Gen Z అంటే జనరేషన్ జెడ్ అని అర్థం. జనరేషన్ అంటే ఒక తరం. సాధారణంగా ఇండియాలో అయితే 20, 30 సంవత్సరాలకు ఒకసారి ఒక జనరేషన్ మారుతుంది. ఇండియాకి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాల అభివృద్ధి, జీవనశైలిలో జరిగిన మార్పులను వివరిస్తూ ఈ జనరేషన్స్ ని మూడు రకాలుగా విభజించారు, 

జనరేషన్ X (1965-1980): ఈ తరం వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అభివృద్ధి దశను చూసిన వాళ్లు. వీళ్ళు కుటుంబ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎక్కువగా ఉమ్మడి కుటుంబాల్లో జీవించేవారు. వ్యవసాయంపై ఆధారపడి, తమ జీవితాలను నిర్వహించేవారు. పెద్దలను గౌరవించడం, ఆత్మీయ సంబంధాలను నిలుపుకోవడం ఈ తరానికి ముఖ్యమైన లక్షణాలు. ఈ తరం వారు టెక్నాలజీతో పెద్దగా పరిచయం లేని సమయాన్ని అనుభవించారు. టైప్ రైటర్లపై ఎక్కువగా ఆధారపడిన కాలం ఇది.

ఈ తరం వారు ఇండస్ట్రియల్ రంగం విస్తరించడాన్ని ప్రత్యక్షంగా చూశారు. వ్యవసాయ ఆధారిత జీవన శైలిలోనుంచి చిన్నచిన్న పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభం కావడం వీళ్ళు చూశారు. కుటుంబానికి నైతిక విలువలను అందించడంలో ఈ తరం వారు అత్యంత ప్రభావవంతులయ్యారు. వారి జీవనశైలిలో సాధారణత, సహనశీలత కనిపించేది.

జనరేషన్ Y (1981-1996): ఈ కాలం చాలా ప్రధానమైన మార్పులను తెచ్చింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియర్ కుటుంబాల వైపు మార్పు ప్రారంభమైంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ మొదలైన టెక్నాలజీలు ఈ కాలంలో ప్రారంభమయ్యాయి. ఇది కంప్యూటర్ విప్లవానికి ప్రారంభం పెట్టిన దశ.

ఈ తరంలో ఐటి రంగం అభివృద్ధి చెందింది. విద్య, ఉద్యోగాలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరినీ చదివించాలనే అభిలాష పెరిగింది. వ్యవసాయాధారిత జీవనశైలినుంచి, ఉద్యోగాల్లో స్థిరపడే మార్గం చేపట్టారు. ఈ తరం వారు నూతన ఆవిష్కరణలను స్వీకరించి, అభివృద్ధిలో తమ వాటాను కొనసాగించారు. ఆర్థిక స్వావలంబన, శ్రద్ధ, అనుకూలత వంటి లక్షణాలు వీరికి ప్రత్యేకమైనవి.

జనరేషన్ Z (1997-2012): ఇది డిజిటల్ జనరేషన్ అని కూడా పిలుస్తారు. ఈ తరం వారు టెక్నాలజీని అత్యధికంగా ఉపయోగించుకున్నారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం ఈ తరం వారికి ఎక్కువగా ఉంది. వీరిని మార్కెట్లో కొత్త ఉత్పత్తుల ప్రాథమిక లక్ష్యంగా భావిస్తారు. వీరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో సమయం గడుపుతారు. పెద్దలను గౌరవించడం గురించి తక్కువగా ఆలోచించే ధోరణి కనిపిస్తుంది.

ఈ తరం వారి ఆలోచనలు చాలా ప్రోగ్రెసివ్. పెళ్ళిళ్ళ అవసరంలేదని భావించే వ్యక్తుల సంఖ్య ఈ తరంలో ఎక్కువగా ఉంది. ఉద్యోగాలకు బదులుగా ఫ్రీలాన్సింగ్, బిజినెస్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సింగ్ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. వీరికి వ్యక్తిగత స్వేచ్ఛకు, అభిరుచులకు ప్రాధాన్యత ఎక్కువ. అయితే టెక్నాలజీని కొన్నిసార్లు దుర్వినియోగం చేయడం వల్ల నెగెటివ్ కామెంట్స్, ట్రెండ్స్ వంటి సమస్యలు పెరిగాయి.

ఈ తరం వారి ప్రతిభపై ప్రశంసలతో పాటు, టెక్నాలజీని దుర్వినియోగం చేసే అంశంపై విమర్శలు కూడా ఉన్నాయి. కానీ వీరి ప్రగతిశీల ఆలోచనలతో దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. ప్రతి తరం ప్రత్యేకమైన లక్షణాలతో ఉంటుంది.

ఇప్పుడు జనరేషన్ బీటా మొదలైంది (2025 – 2039).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *