We Live In Simulation

We Live In Simulation – జీవితం నిజమా – భ్రమా ?
సనాతన భారతీయ చింతన అంటే ఇండియన్ ఫిలాసఫీ జగత్తు అంతా మిథ్య అంటుంది అంటే ఒక మాయామోహక ప్రపంచంలో మనిషి జీవిస్తున్నాడు.
మీలో చాలా మంది మ్యాట్రిక్స్ (Matrix) అనే ఇంగ్లీష్ మూవీ చూసే ఉంటారు. మొత్తం మూడు భాగాలుగా వచ్చిన సినిమా అది. కంప్యూటర్ అల్గారిథం లాగా మనిషి జీవితము 0, 1 అనే అంకెల చట్రంలో తిరుగుతుందని, ఈ ప్రపంచం ఒక సూపర్ కంప్యూటర్ అని అందులోని కృత్రిమ వాతావరణంలో కల్పించబడిన నటన, మనిషి జీవితం అని చెప్తారు. ఆ సినిమాకు భారతీయుల తాత్విక చింతన మూలమని సినిమా దర్శకుడు చెప్పాడు కూడా. అర్థం చేసుకుంటే అర్థం కావడం సులభమే కాదనుకుంటే కావడం కూడా కష్టమే.
జీవితం ఒక కల్పితం. ఇది ఒక కంప్యూటర్ సిములేషన్. లేనిది ఉన్నట్లు కనిపించడమే సిములేషన్ అన్నమాట. వాస్తవ పరిస్థితుల్లో వ్యవహరించడానికి ముందే కంప్యూటర్ మోడల్ ద్వారా ఏదైనా పరీక్షించడం కోసం వర్చువల్ గా ఒక డిజైన్ ను తయారు చేసి దాని రియల్ సిట్యువేషన్ లో పరీక్షిస్తారు. తన ఫలితాన్ని విశ్లేషిస్తారు. అదే కంప్యూటర్ సిములేషన్ మోడల్.
2003 లో సిములేషన్ థియరీని ప్రవేశపెట్టిన నిక్ బోస్టన్ అదేంటో వివరించాడు. అతని కంటే ముందే స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ పద్ధతిని వివరించారు. నిక్ బోస్టన్ సిద్ధాంతో ప్రభావితుడైన సాట్ లియోర్ అనే భౌతిక శాస్త్రవేత్త దాన్ని మరింత విస్తారంగా వివరిస్తూ 2016 లో ఒక ప్రతిపాదన చేశాడు. అతని వివరాల ప్రకారం ఈ ప్రపంచం మాత్రమే కాకుండా, మొత్తం విశ్వమే ఒక సిములేషన్ లో నడుస్తుందని చెప్పారు. ఇంకా చెప్పాలంటే మల్టీవర్స్ అనగా బహుళ విశ్వాలు కూడా ఒక అతి పెద్ద కాస్మిక్ కంప్యూటర్ సిములేషన్ కావచ్చని చెప్పారు.
2020 లో సిములేషన్ హైపోతేసిస్ అనే భావన గురించి వివరిస్తూ ఒక వార్త కథనం ప్రచురితమైంది. ఈ మహా విశ్వం ఒక కృత్రిమ వాతావరణంలో కల్పించబడిన ఘటనల సమూహం అని వివరించే ప్రయత్నం చేశారు.
సిములేషన్ థియరీ ప్రకారం ఈ సువిశాల విశ్వం ఒక కృత్రిమ ఘటనల వాస్తవిక నడక అని అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనకంటే ఆధునికమైన నాగరికత కలిగిన వేరే నాగరికతల వాళ్ళు అభివృద్ధి చేసిన ప్రోగ్రామింగ్ లో భాగంగా చూడాలి. వారి అంటే మనకంటే తెలివైన నాగరికత కలిగిన వారి సిములేటెడ్ ప్రోగ్రామింగ్ లో నడుస్తున్న రియాలిటీలో మనం ఉన్నాం అన్నమాట. ఆర్టిఫిషియల్ రియాలిటీ(Artificial Reality) కంటే కొంచెం బాగా అర్థమవుతుంది. ఆ తరహా పదాలు క్లిష్టంగానే ఉన్నప్పటికీ అలవాటు పడే కొద్దీ వాడిక పదాలు అయిపోతాయి. లేకుంటే కృత్రిమ వాస్తవికత అనే మాటే వింతగా లేదు.
మానవ కార్యకలాపాలకు సంబంధించిన సహజంగా సంభవించే బదులు ఉద్దేశపూర్వకంగా తయారు చేయబడ్డ ఉత్పత్తులు లేదా పరిస్థితులను ఆర్టిఫిషియల్ రియాలిటీ అంటాం. అలా అత్యాధునిక సాంకేతికత కలిగిన నాగరికత సమాజం వాళ్ళు ఎవరో మనకి తెలియరు. అలాంటి వాళ్ళు మనల్ని తయారు చేసి బుద్ధి కుశలత వంటి లక్షణాలను చూపించి మనల్ని నడిపిస్తున్నారు.
ఇంత గందరగోళం మనకు అవసరమా అంటే విజ్ఞానం అంతులేని మార్మికతను మన చుట్టూ పరిచి ఉంచిందని ఎవరైనా ప్రకటించినప్పుడు, దాన్ని ఆ విజ్ఞతతోనే విప్పి చూపాలి. మనిషికి జిజ్ఞాస కనుక ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దో గొప్పో శ్రమించక తప్పదు మరి.
కృత్రిమ వాస్తవికతలు ప్రస్తుతం మనిషి జీవిస్తున్నాడు అనే సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలంటే విజ్ఞానం వేసిన బాటలోనే వెళ్లి తెలుసుకోవాలి. మనకు తెలిసిన వాస్తవికతను దాటుకొని వెళ్లి అర్థం చేసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టు లోకమంతా ఒక మ్యాట్రిక్స్. అనగా మాత్రికలో నిబిడీకృతమై ఉందనుకుంటే వెలుపలికి రావడం అనేది ఉంటుందా, అసలు అది కూడా ఒక చిక్కు ప్రశ్నే. కాబట్టి అంశాల వారిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
లిమిటేషన్స్ పరిస్థితులు వర్చువల్ రియాలిటీ తెలుసు కదా, కంప్యూటర్ గేమ్స్ ఆడే ఆ ప్రాంతం అంతా కల్పిత ప్రపంచమే వాటిలోని ప్రాంతం ముందే రూపొందించబడి నియమాల ప్రకారమే ఆటగాళ్ళు ఆడుతున్న భావనని కలిగిస్తూ ఉంటుంది. అంటే అదొక పరిమితితో ఆడుకునే ఆట. అదేవిధంగా మనం జీవిస్తున్న లోకంలోనూ పలు పరిమితులు ఉన్నాయి. ఎంత ప్రయత్నించిన కాంతి వేగంతో ప్రయాణించడం మానవులకి వీలు కావడం ఒక పరిమితి.
అలాగే మన వద్ద శక్తివంతమైన టెలిస్కోప్లు (Telescope) ఉన్నాయి. వాటి ద్వారా 135 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం వరకే చూడగలం. 1350 కోట్ల కాంతి సంవత్సరాల పరిధిలోని అంతరిక్ష విశేషాలను మాత్రమే మనిషి చూడగలగడం ఒక పరిమితి. ప్రాణం వదిలేసిన మనిషికి ఊపిరి పోయడం మన వల్ల కాని పని. కంప్యూటర్ ప్రాసెసింగ్ స్పీడ్ ను పెంచే కొద్దీ కంప్యూటర్ పనితనపు వేగం తగ్గుతుంది.
అలాగే మన ఈ అఖండ విశ్వం కూడా కంప్యూటర్ ప్రోగ్రామే (Computer Program) అంటున్నారు తత్వవేత్తలు. ఈ ప్రోగ్రాం ను నడిపేందుకు ప్రాసెసర్ కు ఒక పరిమితి ఉంది. దాన్ని అలాగే పని చేయిస్తున్న కొద్దీ ఆ కాస్మిక్ యూనివర్స్ తాలూకు ప్రాసెసర్ వేగం మందగిస్తుంది. దాన్ని మనం కాంతి వేగంతో కొలవగలం. ఇదేమి కొత్త విషయం కాదు. కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణించగలిగే వస్తువు, వస్తువు చుట్టూ స్థల కాలాలు పూర్తిగా మందగిస్తాయని మీరు చదివే ఉంటారు. ఆ వస్తువు తాలూకు స్థలాలు స్తంభించిపోతాయి. అయితే మరి అది సాధ్యమా అంటే కాదు.
స్థల కాలాలు ఏ వస్తువును కాంతి వేగంతో(Light Speed) సరిసమానంగా వెళ్ళనియవు. ఈ లెక్కన ఈ విశ్వాన్ని నడిపిస్తున్న కాస్మిక్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ కాంతి వేగాన్ని అందుకునే సరికి మందగించి పోతుందన్నమాట. అది దానికి విధించబడ్డ పరిధి. ఎలాన్ మస్క్ ఈ విషయంలో ఏం చెప్తున్నాడు అన్నది చూద్దాం.
ఓ 40 ఏళ్ల క్రితం కంప్యూటర్ సిములేషన్ ప్రపంచంలో కేవలం ఒక చుక్క ఒక త్రిభుజం ఉండే గేమ్ ని మాత్రమే తయారు చేశారు. మరి ఇప్పుడు వాస్తవమనే భ్రాంతిని కలుగజేసే కల్పిత కంప్యూటర్ గేమ్స్ లక్షలాదిగా తయారవుతూనే ఉన్నాయి. నిత్యం కొన్ని వేల మంది వాటిని ఒకేసారి ఒకే సమయంలో ఆడుతున్నారు కూడా. ఆ ఒక్క గేమ్ లో వేలాది సిములేషన్ పాటర్న్స్ ఎంచుకోబడ్డాయి.
ఇప్పుడైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అరచేతిలోకి వచ్చేసింది. సదరు కృత్రిమ మేధా సహాయంతో ఇప్పుడు మనం జీవిస్తున్న వాస్తవ ప్రపంచాన్ని పోలిన కృత్రిమ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా పునః సృష్టించుకోవడం పెద్ద కష్టమే కాబోదు. అవ్వడానికి అది ఆట మాత్రమే కానీ మనల్ని పోలిన మనల్ని, అందులో మనం జ్ఞాపకాలతో నింపి అనగా లోడ్ చేసి మన అవతారును తయారు చేసుకుని ఆటలో నిజంగా ప్రవర్తించేలా చేసుకోవచ్చు. మళ్ళీ ఆ మ్యాట్రిక్ సినిమాయే గుర్తొస్తుంది.
అచ్చంగా అలాగే కంప్యూటర్ ప్రపంచంలోకి వెళ్లి వస్తామేమో అనుమానం లేదు. మన కోసం ఒక కృత్రిమ ప్రపంచం ఎదురు చూస్తుంది కావచ్చు. అటువంటప్పుడు ఇప్పటి మన ప్రపంచం కూడా ఒక కంప్యూటర్ సిములేషన్ ఎందుకు కాకూడదు ?
ఇప్పుడు మనకు తెలియడం లేదు, కానీ భవిష్యత్తులో మనమే ఒక సిములేషన్ ని తయారు చేసుకుంటామేమో ? ఎలాన్ మస్క్ వాదన ఇదే. అందుకు గొప్ప సమగ్రత కావాలి అంటే పర్ఫెక్షన్.
సమగ్రత అంటే మన చుట్టూ ఉన్నది. విశ్వంలోని ప్రతి అంశాన్ని పరిశీలించి చూడండి. సరే మన సౌర కుటుంబాన్ని తీసుకుందాం, సూర్య నక్షత్రం దాని చుట్టూ వివిధ కక్షల్లో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అంతేనా. అంటే గ్రహ శేఖలాలు, మరగుజ్జు గ్రహాలు, ఉల్కలు, తోక చుక్కలు, అంతరిక్ష ధూళి, వాయుమేఘాలు ఎన్నో వాటి వాటి లెక్కల ప్రకారం తిరుగుతున్నాయి. వాటన్నిటిని గురుత్వాక ఆకర్షణ శక్తి పట్టి ఉంచుతోంది.
అదే గురుత్వాకర్షణ శక్తి ఈ సువిశాల విశ్వంలోని ఎన్నో భారీ అతి భారీ నిర్మాణాలను రూపొందిస్తుంది. పరస్పర ఆకర్షణ వికర్షణలతో వాటిని ఎంత దూరంలో ఉంచారో అంతే దూరంలో ఉంచి నిర్వహణ విధులు పాటిస్తుంది. అదే గురుత్వ శక్తి నక్షత్ర మండలాన్ని సైతం కూల్చివేస్తుంది, విలీనం కూడా చేస్తుంది. అయితే దానికి ఒక లెక్క ఉందనుకోండి. ఉత్తనే అవి పరస్పరం డీ కొంటూ తత్ఫలితాన్ని సృష్టించడం లేదంటే దానికి ఒక పద్ధతి ఉంది.
విశ్వంలోని కృష్ణ పదార్థం కృష్ణ శక్తి అనగా డార్క్ మేటర్, డార్క్ ఎనర్జీలు సువిశాల నక్షత్రంలో మండలాన్ని పరస్పరం దూరంగా ఉంచుతున్నాయి. అదే సమయంలో విశ్వ విస్తరణ కావిస్తున్నాయి. మహా విస్ఫోటనం తర్వాత ఉనికిలోకి వచ్చిన సింగులారిటీ అనగా ఏకత్వంలో రవ్వంత ఉష్ణోగ్రత వ్యత్యాసం వచ్చి ఉన్నా కూడా విశ్వం ఇలా ఉండేది కాదనేది వాస్తవం. అంటే అంతా కూడా లెక్క ప్రకారమే జరిగింది. విశ్వంలోని ప్రతి అంశం సంపూర్ణంగా తయారైంది అంటే అంతా కూడా ఒక సమగ్రమైన విశ్వ నియమాల అనుసరణే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మరి ఇన్నిటి వెనుక ఉన్న ఆ ఆ గణితం ఏంటన్నది చూడకుంటే ఎలా చెప్పండి. అవును విశ్వంలోని అణువణువు లెక్కపత్రంతోనే తయారైంది. సమగ్రమైన లెక్కలతోనే విశ్వం నడుస్తోంది. పొరపాటుకు ఆస్కారం లేనంతగా విశ్వ రచయిత నిర్వహణ జరుగుతోంది. ఇదంతా దానికి ఎవరైనా చెప్పారా ? లేదు దానికి అదే ఏర్పరచుకున్న నియమావళి అనుకుందాం. అంటే తప్పకుండా పాటిస్తోంది.
అది మనకు అర్థం కావాలంటే గణితం తెలియాలి. గణితం విశ్వ భాష. అసలు మీకో విషయం తెలుసా ? గణితం అంటే మ్యాథమెటిక్స్ అటు సైన్స్ సబ్జెక్ట్ కాదు, అటు సోషల్ సబ్జెక్ట్ కూడా కాదు. రెండింటికీ కావాల్సింది అన్నింటా అంకెల రూపంలో వ్యక్తమయ్యేది. దేన్నైనా సంఖ్యల రూపంలో తెలియజేసేది, ప్రతి దానికి లెక్క చెప్పేది కనుకనే అది యూనివర్సల్ లాంగ్వేజ్ అయింది. ఏది ఎంత సమగ్రతతో ఉందో తెలియడానికి మనకు గణితమే ఆధారం.
కంప్యూటర్ ప్రోగ్రాం కూడా గణితమే. మీరు ఏం చెప్తే అది చేస్తుంది. కనుకనే ఈ విశ్వం గణితంతో రాయబడింది అనేది సత్యం. మనం దాన్ని తెలుసుకోగలగాలి, చదువుకోగలగాలి. అంతే ఆ అంకెల సమీకరణాలు అర్థమైతే చాలు మీరు ఒక ఐన్స్టీన్ అవుతారు. మీలో మరో స్టీఫెన్ హాకింగ్ పుడతాడు.
భూమి మీద ఐదు సార్లు మహా ప్రళయం ముంచుకొచ్చి ఐదు సార్లు సృష్టి మరల మొదలైందని లెక్కలు వేసి చెప్తున్నారు. అంటే ఐదు సార్లు భూగోళం కంప్లీట్ ఫార్మాట్ చేయబడింది అన్నమాట. కొత్త ఆపరేటింగ్ సిస్టం ను మరల ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ పని మొదలు పెట్టింది అన్నమాట. లైఫ్ ని రీఇన్స్టాల్ చేస్తూ వచ్చారన్నమాట.
ఇదంతా గణితం లెక్కల ద్వారానే మనకు తెలిసింది. అలాంటిది అంతా సంఖ్యా శాస్త్రమే కాదు, భౌతిక శాస్త్రము ఉంది. ఇవన్నీ మనకు ఎలా తెలిసాయో అనే సందేహం ఉంటుంది కదా. కనుక ఎలక్ట్రాన్ల ప్రవర్తనలోని వింతైన తీరుతెన్నులు మనకు సమాధానం ఇచ్చాయని శాస్త్ర ప్రపంచం చెప్తోంది. ఎలక్ట్రాన్ల వింత ప్రవర్తనను డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో చూడొచ్చు. ఎలక్ట్రాన్ దానికి అదే ఒక కణంగాను, ఒక కణతరంగంగాను కూడా ప్రవర్తిస్తుంది. వస్తువు ఏదైనా అణువుగా అయినా ప్రవర్తించాలి లేదా తరంగంగా ప్రవర్తించాలి.
ఎలక్ట్రాన్ మాత్రమే రెండు విధాలుగాను ప్రవర్తిస్తుంది. డబుల్ స్లిట్ ప్రయోగంలో ఎలక్ట్రాన్లు ఒక తరంగం మాదిరి ఆకాశాన్ని ఏర్పరచడం శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే ప్రయోగాన్ని పరిశోధకులు చూస్తుండగా చేస్తుంటే మాత్రం ఎలక్ట్రాన్లు అణువుల మాదిరి ఆకారాన్ని ఏర్పరచుకుంటున్నాయి. అంటే మనిషి గమనిస్తున్నట్లుగా ఎలక్ట్రాన్లకు తెలిసిందా అనేది పరమాశ్చర్యం. ఎందుకంటే శాస్త్రవేత్తలు గమనించకుండా ఉన్న ప్రతిసారి అవి తరంగాల మాదిరిగానే ప్రవర్తించాయి. గమనిస్తున్నప్పుడు మాత్రం అణువులుగా ప్రవర్తిస్తూ చుక్కల మాదిరిగా ప్రతిఫలించాయి. అంటే వాటిని ఎవరు గమనిస్తున్నారనే సంగతిని అవి గ్రహిస్తున్నాయని మనం అనుకోవాల్సి వస్తుంది.
మరి ఎలక్ట్రాన్లు ఈ ద్వంద ప్రవర్తనకు కారణం మనమంతా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం లో భాగం కావడమే కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అందులో ఎలక్ట్రాన్ల ప్రవర్తనను అలాగే నిర్ణయించి ఉంటారు. ఎలక్ట్రాన్ల ద్వంద్వానికి క్వాంటం పార్టికల్స్ ద్వారా సమాధానం ఇస్తూ ముందస్తుగా నిర్ణయించబడినట్టుగానే అవి సిములేషన్ లో ప్రవర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ క్వాంటం ఎంటంగిల్మెంట్ కూడా ఒక ప్రత్యేకతను వెలుబుచ్చుతుంది.
రెండు కణాలు అంతరిక్షంలో ఎంత దూరంలో ఉన్న ఒక నిర్దిష్ట మార్గంలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. వాటి స్థితిలో ఏ మార్పు ఉండదు. అణువుల స్వభావంలోని ఈ చిక్కు అర్థం చేసుకోవడం ఒక పెద్ద చిక్కే కూర్చుంది. రెండు వేరు వేరు ప్రదేశాలు పాచికలను విసిరినప్పుడు వాటి మొత్తం ఎల్లప్పుడూ ఎనిమిది వచ్చేలాగానే అవి పడుతున్నాయి అనుకోండి, వాటికి తమలోని రెండో దానిపై ఎంత పడిందో ఎలా తెలుస్తున్నట్టు. రెండిటి మధ్య ఏదో సమాచార వ్యవస్థ ఉందనుకోవాలా ? ఎందుకంటే అలా ఉండబట్టే అవి ఉమ్మడి ప్రవర్తనను చూపిస్తున్నాయి అనుకోవాలి మరి.
భూమి మీద అలాంటి సారూప్యతను ఎల్లవేళలా ప్రదర్శించగలగడం సాధ్యమేనా అంటే మనమైతే అసాధ్యం అని చెప్తాం. కానీ క్వాంటం ప్రపంచంలో అది సాధ్యం. ఖండించిన రెండు భాగాలను గమనిస్తే ఒక భాగం కుడి వైపుకు తిరుగుతూ ఉంది, రెండవ భాగం ఎల్లప్పుడూ ఎడమ వైపుగానే తిరుగుతూ ఉంటుంది. ఆ రెండిటినీ విశ్వంలో ఎంత దూరదూరంగా జరిపినా కూడా అవి దిశలు ఆ విధంగానే ఉంటాయి. రెండిటి మధ్య ఏదో సమాచార వ్యవస్థ తప్పక ఉండి తీరాలి.
అయితే ఆ సమాచారం చేరవేయబడడానికి కాంతి వేగం కంటే చురుగ్గా పనిచేసే వ్యవస్థ అయితే ఏదీ లేదు. అయినా కూడా అవి రెండూ ముందుగానే మాట్లాడుకుంటున్నట్టుగా సారూప్యంగా కదులుతున్నాయి అంటే క్వాంటం ఎంటల్లిమెంట్ వాటిని అలా ప్రవర్తించే చేసిందని, తద్వారా వాటి మధ్య సిములేషన్ నడిచిందని అర్థం. కాంతి వేగాన్ని మించింది లేదు కాబట్టి అది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో భాగంగా జరిగి ఉండాలి.
అంటే విశ్వం ఒక కంప్యూటర్ ప్రోగ్రాం అన్నమాట. బుద్ధి జీవులు ఏవో దాన్ని నడిపిస్తున్నాయి అన్నమాట. మరైతే గ్రహాంతర జీవులు ఉన్నాయంటే ఈ అనంత విశ్వంలో మన పాలపుంత, నక్షత్ర మండలంలోనే వెయ్యి కోట్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి. ఒక వంద కోట్ల నక్షత్రాలు ఆవాస యోగ్యతను కలిగి ఉంటాయి. మన పాలపుంతను దాటి మనం ప్రయాణించకపోయినా ఇక్కడనే ఎక్కడో చోట భూమి మీద కాకుండా వేరే చోట జీవం ఉండి ఉండొచ్చు.
ఆ లెక్కన విశ్వంలో ఇంకెన్ని ప్రదేశాల్లో జీవం ఉండి ఉండొచ్చో ఊహించండి. అయితే దశాబ్దాలుగా మనం మరో తోడు కోసం వెతుకులాట సాగిస్తూనే ఉన్నాం. ప్రయత్నాలు సఫలం అయినా, ప్రయత్నాలు సఫలం కాకున్నా మన ఆరాటం తగ్గలేదు.
మరో జీవ గ్రహం దొరకపోవడానికి సిములేషన్ హైపోతేసిస్ ప్రకారం మన ఈ విశ్వంలో రెండు నాగరికతలు పరస్పరం ఒకదానికొకటి కనిపెట్టలేకుండా ఉండేలా ప్రోగ్రామింగ్ జరిగి ఉండొచ్చు అనేది ఒక కారణం కావచ్చు లేదా ఆ మరో జీవ నాగరికత వేరే సమాంతర లోని గ్రహం మీద కొనసాగుతూ ఉండొచ్చు. అప్పుడు రెండు నాగరికతలు రెండు వేరు వేరు కంప్యూటర్ ప్రోగ్రాంలో భాగంగా సమాంతరంగా కొనసాగుతూ ఉండి ఉండొచ్చు. అప్పుడు పరస్పరం కలవడం అనేది ఎప్పటికీ సిద్ధించని అంశంగానే ఉండిపోతుంది.
అంటే ఈ విశ్వం ఒక కంప్యూటర్ ప్రోగ్రాం కావచ్చునగా. ఈ అనంత విశ్వం ఒక కంప్యూటర్ సిములేషన్ ప్రోగ్రాం కావచ్చు అనడానికి ఇవన్నీ కొన్ని కారణాలు మాత్రమే, శాస్త్రవేత్తలు మరిన్ని కారణాలను మరిన్ని ఉదాహరణలను చూపించగలరు. మరి అలాంటప్పుడు మనం ఈ సిములేషన్ నుంచి వెలుపలికి రాగలగడం అనేది అసాధ్యమేమో అనుకుంటే ఈ మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని దానికి ప్రతిక్రియగా మరో ప్రోగ్రాం రాయగలిగితే ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఆ అత్యాధునిక నాగరికత కలిగిన నాగరికులతో అంటే బుద్ధిజీవులతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం.
ఈ మొత్తం భావనని ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే మాయామోహిత ప్రపంచంలో చక్రవ్యూహం వంటి ఆకర్షణల వల నుంచి తప్పించుకోవాలంటే మోక్షం దిశగా ప్రయాణించాలంటే వేరెక్కడ వెతుకులాడకుండా మనం మనలోకి చూడగలగాలి. ఆత్మ సాక్షి సాక్షాత్కారమే పరమ పదాన్ని చేర్చగలదని భారతీయ సనాతన చింతనం వివరిస్తోంది. సంసార మోహ చక్రం నుంచి విముక్తులు కావాలంటే, ఆ కంప్యూటర్ సిములేషన్ మోహజాలం నుంచి విడుదల పొందాలంటే మానవుడు అంతర్ముఖుడు కావాలి. మన అంతః చైతన్యం మనకు ఆ సిములేషన్ ప్రపంచంతో ఉన్న అనుసంధానను దర్శింపజేస్తుంది.
మన చైతన్యంలో కదలికలు వచ్చి జాగృతం అయ్యే కొద్దీ ఒక్కో స్థాయిలో అది మనల్ని బంధనాల నుంచి విముక్తి చేస్తూ మోక్ష సిద్ధిని కలిగిస్తుంది. ఏమో ఆ ఆధునిక నాగరికతలో ఉన్నవాళ్ళు మనల్ని తిరిగి చక్రబంధం వైపే నడిపిస్తున్నారేమో ! మరలా మరల మనల్ని ఆ మూలం వైపుకే మళ్ళిస్తూ మన ప్రోగ్రామింగ్ లో అత్యున్నత స్థితిని చేరే దారిని మూసేస్తున్నారేమో ! ఇది అంతులేని గొలుసుకట్టు చర్య కూడా కావచ్చు. ఏమో ఇది కూడా ఆలోచించాల్సిందే.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం|
ఇహ సంసారే బహుదుస్తారే ,
కృపయాపారే పాహి మురారే||
ఇది ఆదిశంకరాచార్యుల భజగోవిందం శ్లోకాల్లో చెప్పింది. ఈ తత్వం గ్రహించాలంటే తీవ్రమైన సాధన చేయక తప్పదు.