The Eightfold Path of Gautama Buddha

The Eightfold Path of Gautama Buddha

The Eightfold Path of Gautama Buddha | గౌతమ బుద్ధుని అష్టాంగమార్గం | Part 5

సిద్ధార్థుడు తన 35 వ ఏట జ్ఞానోదయం పొందాడు. అయితే రావి చెట్టు కింద ధ్యానంలో కూర్చున్న 49 రోజులకు ఆయనకు జ్ఞానోదయం అయింది. సిద్ధార్థుడు ముందు జ్ఞానోదయం కోసం గురువుల దగ్గరికి వెళ్ళాడు. కానీ లాభం లేదని తెలుసుకున్నాడు. శరీరాన్ని విపరీతంగా హింసించుకున్నాడు, వాటి వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు. 

అంటే జ్ఞానోదయం కోసం గురువు గాని, మరే ఇతర వ్యక్తుల సహాయం గాని అవసరం లేదు. అలాగే శరీరాన్ని కష్టపెట్టనవసరం కూడా లేదు. ఎందుకంటే జ్ఞానోదయం అంటే శరీరానికి సంబంధించింది కాదు, అది మనసుకు సంబంధించింది. 

నిజానికి మనిషి పుట్టుక దుఃఖం, చావు దుఃఖం. ఈ రెండింటి మధ్యనున్న జీవితం అంతా కూడా దుఃఖమే. అంటే ఆ దుఃఖం మధ్యలోనే అప్పుడప్పుడు సంతోషం వచ్చిపోతుంది. ఎలాగంటే ఇక్కడ ఉన్నదంతా చీకటే కానీ 12 గంటలు వెలుగు వచ్చిపోయినట్లు. అలాంటి దుఃఖానికి కారణాలను సిద్ధార్థుడు అవగాహన చేసుకున్నాడు. 

దుఃఖానికి గల కారణాలను 11 సూత్రాలుగా చెప్పాడు. అవేంటంటే 

  1. అవిద్య నుంచి సంస్కారం పుట్టింది. అవిద్య అంటే తెలియనితనం, భ్రాంతి. వాటి నుంచి సంస్కారం పుట్టింది. 
  2. సంస్కారం నుంచి విజ్ఞానం కలిగింది. ఇక్కడ విజ్ఞానం అంటే సైన్స్ అని అర్థం కాదు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలు, అంటే చూడడం వినడం, స్పర్శ, ఆస్వాదించడం. 
  3. విజ్ఞానం నుంచి నామరూపాదులు ఉదయించాయి, అంటే ఈ విజ్ఞానం నుంచే రకరకాల రూపాలు పుట్టాయి.
  4. నామరూపాల నుంచి షడాయతనం ఉత్పన్నమైంది. షడాయతనం అంటే ఐదు జ్ఞానేంద్రియాలైన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మంతో పాటు మనసు అని అర్థం.
  5. షడాయతనం నుంచే స్పర్శ పుట్టింది, అంటే ఈ ఐదు రకాల అవయవాల నుండి ఇక్కడ మనసు అవయవం కాదు, వాటితో పాటు మనసు ద్వారా గ్రహించే విషయాల సంయోగం వల్ల స్పర్శ పుట్టింది. 
  6. స్పర్శ యందు వేదన జనించింది. వేదన అంటే దుఃఖం. స్పర్శ నుండి దుఃఖం పుట్టింది. 
  7. వేదన నుంచి తృష్ణ బయలుదేరింది. తృష్ణ అంటే కోరిక, అంటే దుఃఖంలో నుండి కోరిక పుట్టింది.
  8. తృష్ణ ఉపదానానికి కారణభూతమైంది. ఉపదానం అంటే ఆసక్తి నుండి పుట్టే పట్టుదల అంటే కోరిక. ఏదో చేయాలనే పట్టుదలకి అనగా కర్మోత్పత్తికి కారణమైంది.
  9. ఉపదానం భవానికి మూలమైంది. భవం అనేది మన ఆలోచనలు, క్రియలు, మన కోరికల ఫలితంగా ఏర్పడే అస్తిత్వ స్థితి లేదా అనుభవ పరిస్థితి.
  10. భవం నుంచి జాతి ఏర్పడింది. ఇక్కడ జాతి అంటే పుట్టుక అని అర్థం. ఈ అస్తిత్వ స్థితి నుంచే మనిషి పుట్టుక జరిగింది. 
  11. జాతి నుంచి జర, మరణ, శోకం, అనుతాపం, దుశ్చింత, ఉద్వేగం మొదలైన అన్ని దుఃఖాలు ఉత్పన్నమయ్యాయి.

ముందు చెప్పుకున్నట్టుగా మనిషి పుట్టుక నుంచే దుఃఖానికి కారణమైన అన్ని పరిస్థితులు పుట్టాయి. ఇలా సిద్ధార్థుడు తత్వ విచారణ చేయగా, మనిషి దుఃఖానికి మూల కారణం అవిద్య అని తెలిసింది. కాబట్టి దుఃఖాన్ని నాశనం చేయాలంటే ముందు అవిద్యను నాశనం చేయాలి. అలాంటి అవిద్యను నాశనం చేయడానికి ఎనిమిది సూత్రాలను పాటించాలని సిద్ధార్థుడు గ్రహించాడు.

జ్ఞానోదయం పొందాడు కదా, ఇంకా అతన్ని బుద్ధుడు అనకుండా సిద్ధార్థుడు అని ఎందుకు అంటున్నామంటే అతడు ఇంకా దుఃఖానికి గల కారణాలను తెలుసుకునే ప్రాసెస్ లోనే ఉన్నాడు కాబట్టి. 

రెండోది అతను తెలుసుకున్న విషయాలను వేరే వాళ్ళకు చెప్పిన తర్వాతే బుద్ధుడు అయ్యాడు. అలా సిద్ధార్థుడు తన మొదటి బోధను ఒక వ్యక్తికి చేశాడు. అయితే అవిద్యను నాశనం చేయడానికి ఎనిమిది సూత్రాలను సిద్ధార్థుడు చెప్పాడు.

గౌతమ బుద్ధుని అష్టాంగమార్గ సూత్రాలు

  • ఒకటి పవిత్ర మతం
  • రెండు పవిత్ర భావం
  • మూడు పవిత్ర కార్యం
  • నాలుగు పవిత్ర వాక్యం
  • ఐదు పవిత్ర జీవితం
  • ఆరు పవిత్ర చేష్ట
  • ఏడు పవిత్ర చింతనం
  • ఎనిమిది పవిత్ర స్మృతి

వీటినే అష్టాంగ మార్గం “ఎయిట్ ఫోల్డ్ పాత్ ” అంటారు.

Gautam Buddha Series: గౌతమ బుద్ధుని మొదటి బోధన | Part 6

Gautam Buddha Series: గౌతమ బుద్ధుని జ్ఞానోదయం | Part 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *