Secrets of Nalanda University

Secrets of Nalanda University | నలంద విశ్వవిద్యాలయం రహస్యాలు
నలంద విశ్వవిద్యాలయం కాలాలు గడిచిన, నేటికి విశ్వ విఖ్యాతమైన ఘన చరిత్రను గుర్తు చేస్తూనే ఉన్న విజ్ఞాన సర్వస్వం. కాలానికి అతీతమైన విజ్ఞాన శాస్త్రాల కుదురు. అగ్నిలో ధ్వంసమైన ప్రపంచ పురాతన విశ్వవిద్యాలయాల్లో ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయం భారతీయ చరిత్రకు ఒకనాటి ఆనవాలుగా మాత్రమే ఇప్పుడు ఉంది. నిజానికి ఆనాడు జరిగింది ప్రమాదం కాదు, హేయమైన దుశ్చర్య. 90 లక్షల అమూల్యమైన వ్రాత ప్రతులను మింగేసిన అగ్నిని రాజేసింది కాలం కాదు, అసూయతో రగిలిపోయిన మనిషని తెలిస్తే నేటికి మనసులో చిన్నపాటి ఉద్వేగం, బాధ కలగక మానదు. చరిత్రను అభిమానించే వారి గుండెల్లో తీరని విషాదాన్ని నింపిన విద్వేషపు చర్య అది.
ప్రపంచ వ్యాప్తంగా వేలాది విద్యార్థులు ప్రతి ఏటా జ్ఞానం సంపాదించుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, విజ్ఞాన శాస్త్రాల అధ్యయనానికి ప్రాచీన భారతదేశానికి వచ్చి నేర్చుకొని వెళ్ళేవాళ్ళు. అప్పటికి ఆక్స్ఫర్డ్ మరియు హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు (Oxford and Harvard university) ఇంకా ప్రసిద్ధి చెందలేదు. నలంద యొక్క పురాతన చరిత్ర, దాని ప్రాముఖ్యత, విధ్వంసం గురించి తెలుసుకుందాం.
ఆనాడు వేలాది మంది బౌద్ధ సన్యాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భయంకరమైన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి గురించి, నలంద విశ్వవిద్యాలయం యొక్క విషాదకరమైన పతనాన్ని తెలుసుకోవడం వెనుక, మన దేశ ఘనమైన సంస్కృతి వారసత్వాల ప్రఖ్యాతి తెలుసుకోవడం ఒక్కటే కాదు, నలంద వారసత్వం చరిత్రలో ఎలా కనుమరుగైపోయింది, తిరిగి దశాబ్దాల తర్వాత ఎలా కనుగొనబడింది అనే విషయాలు మన తరాలకు భావితరాలకు ఒక స్ఫూర్తిని కలిగిస్తాయి.
1193 వ సంవత్సరం నలంద విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ప్రార్థన స్థలాలు, బౌద్ధ ఆరామాలు, గ్రంధాలయాలు అన్ని చేతులు చాచి, కమ్ముకున్న మంటల్లో బూడిద అయిపోయాయి. గ్రంధాలయ బాండాగారం తప్ప మిగతావన్నీ రోజుల్లోనే చల్లబడ్డాయి. కానీ అది మాత్రం మూడు నెలల పాటు దగ్దం అవుతూనే ఉంది. ఆయుర్వేదం వేదం నుంచి అంతరిక్ష విజ్ఞానం దాకా ఎన్నెన్నో విషయాలు, దాదాపు 90 లక్షల గ్రంథాలు, పుస్తకాలు, పత్రాలు మంటల్లో కాలిపోయాయి.
ప్రస్తుతం లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దేశం విడిచి వేరే దేశాలకు వెళుతున్నారు. వేల సంవత్సరాల క్రితం లక్షల మంది విద్యార్థులు జ్ఞాన సముపార్జన కోసం, తమ విద్యాభ్యాసం కోసం భారతదేశానికి వచ్చేవారు. భారతీయ ప్రాచీన విశ్వవిద్యాలయాల్లోకెల్లా ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయం విద్యార్థులతో, పండితులతో, చర్చా గోష్టులతో సందడిగా ఉండేది. విజ్ఞాన కనిగా వెలిగిపోతూ ఉండేది.
నా-అలం-ద అనే మూడు శబ్దాల అర్థం నిరోధించలేని జ్ఞాన ప్రవాహం అని, అంతులేని విశ్వ విజ్ఞాన భాండాగారం కనుకనే ఆ విద్యాలయానికి నలంద విశ్వవిద్యాలయం అని పేరు వచ్చింది. దాదాపుగా 57 ఎకరాల స్థలంలో విస్తరించిన చదువుల గుడి అది. సాహిత్యం, వేదాంత శాస్త్రం, తర్క శాస్త్రం, గణితం, వైద్య శాస్త్రం ఇక మరెన్నో శాస్త్రాలు బోధించబడిన విద్యాలయం అది.
చైనా, టిబెట్, ఇండోనేషియా, జపాన్, పర్షియా, టర్కీ వంటి ఎన్నో దేశాల విద్యార్థులు జ్ఞాన సమపార్జన కోసం నలంద చేరుకునే వాళ్ళు. నలంద కేవలం చదువుల బడి మాత్రమే కాదు, 57 ఎకరాల్లో ఎనిమిది ప్రాంగణాలు కలిగి ప్రార్థన మందిరాలు, ఆరామాలు, తరగతి గదులు, విశాలమైన మంటపాలు, స్తూపాలతో, అద్భుతమైన వాస్తు నిర్మాణాలతో ఆకర్షణీయంగా ఉండే ప్రాంతం కూడా. వసతి గృహాలు, సరస్సులు, తోటలతో సుందరమైన ప్రదేశంగా ఉండేది.
1500 సంవత్సరాల క్రిందట ఈ నిర్మాణాలు ఎర్రని ఇటుకలతో కట్టబడ్డాయి. ముఖ్య నిర్మాణమైన గ్రంధాలయాన్ని ధర్మగంజ్ అని పిలిచేవారు. అన్ని రకాల విషయాలకు సంబంధించిన మొత్తం చేతి ప్రతులతో కలిగిన 90 లక్షల గ్రంథాలు, సువిశాల గ్రంధాలయంలో కలిగి ఉండేవి.
చారిత్రక కథనాల ప్రకారం 500 మంది వ్యాపారులు గౌతమ బుద్ధుడికి కానుకగా సమర్పించిన తోటలు పెంచిన స్థలంలోనే, ఆ తర్వాత నలంద నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. గౌతముడు మూడు నెలల పాటు అక్కడే ఉండి, బౌద్ధ ధర్మాన్ని బోధించిన కారణంగా ఆ ప్రదేశమే విశ్వవిద్యాలయ నిర్మాణానికి అనువైనందని వారు భావించారు.
చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ రచనలో లభించిన వివరాల ప్రకారం చూస్తే ఐదవ శతాబ్దంలో గుప్త వంశ రాజుల పరిపాలన కాలంలో సక్రాదిత్యుని ఆధ్వర్యంలో నలంద విశ్వవిద్యాలయం నిర్మించబడినట్లు తెలుస్తోంది. భారతీయ గణిత మహాశాస్త్రవేత్త ఆర్యభట్ట ఆరవ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయ నిర్వాహకుడిగా అక్కడ ఉన్నట్టు చరిత్ర చెప్తోంది. గణితంలో సున్నా అనగా శూన్యాన్ని ప్రవేశపెట్టింది ఆర్యభట్టే.
ఏడవ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందిన తర్వాత, భారత్ ను సందర్శించిన చైనా పండితుడు, యాత్రికుడు అయిన హుయాన్సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలో బౌద్ధాన్ని, మార్మిక వాదాన్ని అధ్యయనం చేయడానికి వచ్చాడు. ఆయన ఇక్కడున్న కాలంలో విశ్వవిద్యాలయంలో పది వేల మంది విద్యార్థులు 2000 మంది ఆచార్యులు ఉండేవారని తన గ్రంథాల్లో రాసుకొచ్చాడు. ఆధారాలను బట్టి హుయాన్ సాంగ్ నలందలో కనీసం పదేళ్ల పాటు వివిధ అంశాల మీద అధ్యయనం చేసి ఎన్నో వ్రాత ప్రతులను తీసుకుని చైనాకు తిరిగి వెళ్ళినట్టు అర్థమవుతుంది.
నలంద నిర్మాణం తర్వాత చాలా సార్లు దాడులకు గురైంది. ప్రతిసారి తిరిగి పుంజుకుని నిర్మాణాలు జరుపుకొని తన ఖ్యాతిని నిలబెట్టుకుంది. ఆ ఖ్యాతి అలా కనీసం 800 ఏళ్ల పాటు వెలుగులు వెరజిమ్ముతూ ఉందని చెప్తారు. అయితే ఆ వెలుగులను కమ్ముకున్న అంధకారం పేరు ముహమ్మద్ బక్తియార్ ఖిల్జీ. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక తెగకు చెందిన అతను పని వెతుక్కుంటూ ఢిల్లీ అవద్ద ప్రాంతాలకు వచ్చాడు. చెప్పుకోదగ్గ ఫలితం ఏం కనపడక స్థానిక రాజు యొక్క సైనిక పటారంలో చేరాడు.
అతని యుద్ధ నైపుణ్యాన్ని గమనించిన అవద్ద రాజులు తమ సైన్యాధికారి క్రింద ఉండే ఒక సైనిక విభాగానికి అతన్ని నాయకుడిగా నియమించి, నేటి బీహార్ (Bihar) సరిహద్దులోని రెండు గ్రామాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆపై మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ (Muhammad Bakhtiyar Khalji) మెల్లగా బీహార్ లోని వివిధ ప్రాంతాల మీద దాడులు చేసి వాటిని ఆక్రమించుకున్నాడు. ఆ సమయంలోనే అతని ఆరోగ్యం బాగా దెబ్బతింది. అతని మతానికి చెందిన వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నయం కాలేదు.
అయితే నలంద విశ్వవిద్యాలయ ఆయుర్వేద శాస్త్రజ్ఞుడైన ఆచార్య శ్రీ రాహుల్ శ్రీభద్ర వద్ద తన రోగానికి చికిత్స ఉందనే సంగతి ముహమ్మద్ బక్తియార్ ఖిల్జీ విన్నాడు. తన హకీంలో నయం చేయలేని వ్యాధిని పరధర్మానికి చెందిన వైద్యులు నయం చేయగలుగుతారంటే, అతడికి నమ్మకం కలగలేదు. అయినా సరే చూద్దామని వెళ్ళిన అతను ఆచార్య శ్రీభద్రకు సవాలు విసిరాడు. ఆచార్య శ్రీ రాహుల్ శ్రీభద్ర నిజంగానే తనకు చికిత్స చేయగలిగే మొనగాడే అయ్యు ఉంటే తనను తాకకుండా, తనకు ఏ మందు ఇవ్వకుండా, తన రోగాన్ని పోగొట్టాలని బక్తియార్ ఖిల్జీ షరతు పెట్టాడు. శ్రీభద్ర అతని సవాల్ని స్వీకరించి అతనికి ఖురాన్ గ్రంధాన్ని ఇచ్చాడు. ప్రతిరోజు ఆ ఖురాన్ (Quran) పటించమని చెప్పాడు అదే అతనికి చికిత్స అని వివరించాడు.
ఆచార్య శ్రీభద్ర చెప్పినట్లే ఖిల్జీ ఖురాన్ ని చదువుతూ వచ్చాడు. ఆశ్చర్యం ఖిల్జీ రోగం నయం అవుతూ వచ్చి పూర్తిగా స్వస్థత జరిగింది. ఏంటంటే ఖిల్జీకి ఇచ్చిన ఖురాన్ గ్రంథం పుటలకు ఆచార్య శ్రీభద్ర ఔషధాన్ని పూసి ఇచ్చాడు. ప్రతిరోజు ఆ కాగితాన్ని తెరగేస్తూ ఉండడం మూలంగా ఖిల్జీకి తెలియకుండానే ఆ ఔషధ లేపనం అతని శరీరంలోకి చేరుతూ వెళ్ళింది. దాంతో రోగం నయమైంది. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు ? ఆ ఆపద నుంచి గట్టెక్కించిన వారిని సత్కరిస్తారు, కనీసం నమస్కరించి గౌరవిస్తారు. అయితే ఖిల్జీ సంగతి అందుకు భిన్నం జరిగిన దాన్ని స్వీకరించలేకపోయాడు.
పరధర్మంలోని గొప్పతనాన్ని అంగీకరించలేక మనసు కష్టపెట్టుకున్నాడు. తన ఇస్లాం ధర్మానికి చెందని వారంతా దైవ విశ్వాసులు కారణి నమ్మే మనస్తత్వం కలిగిన బక్తియార్ ఖిల్జీకి, ఆ పరధర్మానికి చెందిన వైద్యుని చేతిలో తాను ఆరోగ్యవంతుని కావడం అన్నది సహించలేకపోయాడు. మరి ఏం చేయాలి ? తనకు ప్రాణం నిలబెట్టినాకానీ తనలో చెలరేగుతున్న అసూయ, ద్వేషం చలబరుచుకోవడానికి భారతీయ జ్ఞాన సంపదని కాల్చివేయాలని నిర్ణయించుకున్నాడు.
మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ తన సైన్యంతో నలందలో ప్రవేశించి అన్ని మూలలా నిప్పు పెట్టించాడు. వేలాది బౌద్ధ సన్యాసులు, ఆచార్యులు, విద్యార్థులు ఆ మంటల్లో కాలిపోయారు. గ్రంధరాజాలన్నీ బూడిద కుప్పలుగా మారిపోయాయి. నలంద చరిత్ర మాసిపోయింది. విశ్వవిద్యాలయ ఖ్యాతి చీకటి మాటున కప్పబడిపోయింది.
పర్షియా చరిత్ర పరిశోధకుడైన “మీనాజ్ ఈ సిరాజ్” తను రాసిన “తబాకత్ ఈ నశ్రీ” అనే గ్రంథంలో నలంద విశ్వవిద్యాలయం నాశనం చేయబడిన తీరును, ఆనాటి దారుణానాన్ని ప్రస్తావించాడు. వేలాది బౌద్ధ సన్యాసుల్ని సజీవ దహనం చేశారని, కొన్ని వేల మంది శిరస్సుల్ని తెగనరికారని, బౌద్ధ ధర్మాన్ని బూడిద పాలు చేయడానికి ఖిల్జీ తాను చేయగలిగినంత నాశనం చేశాడని రాశారు. నెలల పాటు తగలబడుతూ ఉండిపోయిన విశ్వవిద్యాలయం గ్రంథాల నుంచి పైకి ఎగసిన పొగ మసి, చుట్టూ ఉన్న పర్వతాల మీద నల్లని దుప్పటిలా కప్పుకుందని అందులో రాసి ఉంది.
నలంద విశ్వవిద్యాలయం అగ్నికి ఆహుత అయ్యాక భారత్ లో బౌద్ధ ధర్మం కూడా పతనమైపోసాగింది. కాలం గడిచే కొద్దీ నలంద ప్రజల జ్ఞాపకాల నుంచి తొలగిపోయింది. విశ్వవిద్యాలయ ఆనవాళ్ళు మరుగున పడిపోయాయి.
1811-1812 మధ్య నలంద చరిత్రలో ఒక్కసారిగా కదలికొచ్చింది. నలంద ప్రాంతాన్ని సర్వే చేసిన స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త అయిన ఫ్రాన్సిస్ బుచన్ కి అక్కడ కొన్ని బౌద్ధ గ్రంథాల ప్రతులు లభించాయి. అప్పటి పురావస్తు శాఖ వారికి ఈ సంగతి చేరవేశాడు. ఆయన దాంతో అక్కడ తవ్వకాలు జరిగాయి, చరిత్ర పరిశోధనలు జరిగాయి. చివరకు సాంగ్ తన యాత్ర గ్రంథాల్లో ఉటంకించిన నలంద విశ్వవిద్యాలయ ప్రాంతం అదేనని, అవన్నీ ఆనాడు అగ్నికి ఆహుతి కాగా ఇన్నాళ్లు మరుగున పడిపోయిన ఆనవాళ్ళు గుర్తించారు.
1915 వరకు జరిపిన తవ్వకాల్లో 11 బౌద్ధ రామాలు, ఆరు ప్రార్థన మందిరాల తాలూకు సిద్ధాలు వెలుగు చూసాయి. 30 మీటర్ల వెడల్పైన ఒక రహదారి కూడా తవ్వకాల్లో బయటపడింది. అప్పుడు అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. తాము తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి మించి కొన్ని రెట్లు ఎక్కువ విశాలమైన ప్రాంతం వరకు నలంద విశ్వవిద్యాలు విద్యాలయం విస్తరించి ఉండాలి అని.
తవ్వకాల్లో రాగి విగ్రహాలు, చేతి కళాకృతులు, బౌద్ధ సంస్కృతికి చెందిన నిర్మాణాలు, శిల్పాలు, నాణాలు, ముద్రణలు, నేటికి నలంద ఆనవాళ్ళు భూగర్భంలో చరిత్రలో దాగి ఉన్నాయని, వెలుగు చూడాల్సినవి చాలానే ఉన్నాయని చరిత్రకారులు, పురావస్తు నిపుణులు, సంబంధిత అధికారులు విశ్వసిస్తున్నారు.
2006 మార్చ్ లో అప్పటి మన రాష్ట్రపతి డాక్టర్ శ్రీ ఏపిజే అబ్దుల్ కలాం (Dr. APJ Abdul Kalam), బీహార్ రాష్ట్ర శాసన సభలో గౌరవ ఉపన్యాసం ఇస్తూ, ప్రాచీన నలంద విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేయాలని చెప్పారు. 2010 లో నలంద విశ్వవిద్యాలయ చట్టం రూపొందింది. 2014 సెప్టెంబర్ లో, సుమారు 800 సంవత్సరాల తర్వాత నలంద విశ్వవిద్యాలయ ప్రాంగణం విద్యార్థుల కోసం ప్రారంభించబడింది.
నిజానికి ఇదొక చారిత్రక సందర్భమే, కాదనలేం. అయితే ఆనాటి పూర్వ వైభవాన్ని కూడా తిరిగి స్థాపించగలిగితే అది మరింత గొప్ప విజయంగా భావించొచ్చు.