Mahaa Kumbhamela 2025 – మహా కుంభమేళా

Mahaa Kumbhamela 2025 – మహా కుంభమేళా
కోట్లాది భారతీయుల ఆధ్యాత్మిక సాధన మార్గంలో మహా కుంభమేళ ఒక విశేషమైన సందర్భం. ఈసారి 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే మహా కుంభమేళ అనే పవిత్ర సంఘటన కూడా తోడుగా వచ్చిందని పండితులు సెలవిచ్చారు. ప్రతి ఏటా భారతదేశంలోని ఒక్కో నదికి జరిగే పుష్కరాల గురించి మనకు తెలుసు. ఈ 2025 లో మే నెలలో సరస్వతి నదికి పుష్కరాలు జరగనున్నాయి. ఈలోగానే 12 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళ కోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ సిద్ధమైంది.
ఈ 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరగనున్న ఈ మహా కుంభమేళ కోసం దేశవ్యాప్తంగా 13000 రైళ్లను ప్రయాగరాజు వైపు నడిపిస్తున్నామని రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని సమాచార ప్రసార మాధ్యమాల్లోనూ, అన్ని రకాల రవాణా సౌకర్యాల వద్ద ఇందుకు సంబంధించి విశేషమైన ప్రచారం చేస్తోంది.
ప్రభుత్వం కుంభమేళ ప్రదేశంలో శుచి, శుభ్రత, మంచి నీరు, ఆహారం, బస, రవాణా, సమాచారం, వైద్యం ఇంకా పలు రకాల వసతులను కల్పిస్తుందని, ఆ సమాచారం వివిధ వెబ్సైట్స్, యాప్ ల ద్వారా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి జరగనున్న మహా కుంభమేళ విశేషం ఏంటో తెలిస్తే ఆ ఉత్సవంలో పాల్గొనడానికి సరైన ఉత్సాహం కలుగుతుంది.
మీకు తెలుసు కదా ప్రపంచం మొత్తం మీద అతి ఎక్కువ మంది పాల్గొనే ఏకైక ఉత్సవం ఈ మహా కుంభమేళాని ప్రపంచ రికార్డుల్లో ఎప్పుడో నమోదయింది. ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కూడా ఇదే. దేశ విదేశ నుంచి కోట్లాది మంది భారతీయులు, ఇతర దేశస్తులు సైతం ఈ కుంభమేళాకు వస్తూ ఉంటారు.2019లో అర్ధ కుంభమేళ జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు సుమారుగా 20 కోట్ల మంది పాల్గొన్నారు.
విశ్వాసం, సంప్రదాయం, ఆచారం, దైవ చింతన, ధ్యాన, యోగ భక్తి మార్గాలన్నిటి ద్వారా పరమాత్మను స్మరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో జీవిత సత్యాన్వేషణ కోసం తపస్సు చేసే సాధువులు. గుండెల్లో నిండైన భక్తి తప్ప ఇతర ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధ విషయాలు తెలియని స్వచ్ఛమైన సాధారణ భక్తులు సైతం మహా కుంభమేళకు వచ్చి గంగలో మునిగి పునీతులై తృప్తితో ఇళ్లకు చేరుకుంటారు.
సనాతన హిందూ ధార్మిక విశ్వాసం కలిగిన మహా కుంభమేళకు పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత ఉంది. అవును మత విశ్వాసం అనే సంక్షిప్త, సంకుచిత అర్థం కాదు ఈ సందర్భం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థానానికి దారి తీసే ఆచారం ఇది. గంగా నది పవిత్రతతో తాము కూడా పాపహితులమై పునీతులమవుతామనే విశ్వాసం ఉంది. మనశ్శాంతి, మోక్ష ప్రాప్తి, జీవన్ ముక్తి కలిగించే శక్తి నదులకు ఉందని, పుష్కరాలు కుంభమేళాల కాలంలో ఆ ఆధ్యాత్మిక శక్తి మహోన్నతంగా చేకూరుతుందనే విశ్వాసం కోట్లాది మంది ప్రజలకు ఉంది.
క్షీరసాగర మధనం వేళ చివరిగా ఉద్భవించిన అమృత బాండం కోసం దేవదానవులు ఇద్దరు కీచులాడుకున్నారని తెలుసు కదా. దూర్వాస ముని శాపం వల్ల బలహీనులైన దేవతలు అమృత సేవనం చేసి తిరిగి శక్తివంతులం కావాలని భావించి, ఆ పని తమ వల్ల మాత్రమే అవ్వదు కనుక రాక్షసుల సహాయం కూడా తీసుకుని పాలసముద్రాన్ని చిలుకుతారు. రాక్షసులకు సగం పాలు ఇవ్వాలని ఒప్పందం. తీరా అమృత కలశం వెలువడగానే ఇరు పక్షాలు గొడవ పడ్డారు.
అప్పుడు విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతున్ని ఆ కలశం లాక్కొని దూరంగా వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. అలా గరుడు ముక్కున కరుచుకుని తీసుకువెళ్తున్న అమృత కలశం నుంచి తొనికి జారిపడ్డ నాలుగు అమృత బిందువులు భూమి మీద హరిద్వార్, ఉజ్జైని, నాసిక్, ప్రయాగరాజ్ లో పడ్డాయి. అప్పటినుంచి ఈ నాలుగు ప్రదేశాలు మహిమాన్వితమైన తీర్థ క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
అమృతం కోసం జరిగిన కొట్లాట మానవుల లెక్కల్లో 12 సంవత్సరాల పాటు జరిగింది. అది వారికి 12 రోజులతో సమానం. కనుకనే పుష్కరం అనే కాలం లెక్కల్లో విశేష ఉత్సవాలు చేసుకోవడం ప్రారంభమైంది.చరిత్రను చూసిన 19వ శతాబ్దం నుంచి మనకు ఇందుకు ఆధారాలు లభిస్తున్నాయి. అయితే ఇది మనకు తెలిసిన తాజా సమాచారం క్రింద లెక్కించాలి.మరైతే అంతకు మునుపు చరిత్ర కూడా చూడాలి కదా.
మాఘమాసంలో నదీ స్నానాలు చేయడం పవిత్రతకు చిహ్నంగా భారతీయులు వేల సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్నారు.వాటిని మాఘ స్నానాలుగా పరిగణిస్తారు. ఋగ్వేదంలో క్షీరసాగర మధనం, అమృత ప్రాప్తికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. గుప్త మౌర్య సామ్రాజ్యాల పరిపాలన కాలంలోనూ కుంభమేళ జరిగినట్లు చారిత్రక వివరాలు చూడొచ్చు.
కాలక్రమంలో కుంభమేళ ఆధ్యాత్మిక సాధనకు ప్రజల్లో ఐక్యమత్యం పెంపునకు దారి తీసింది. దేశం నలుమూలల నుంచి వచ్చే సాధువులతో సన్యాసులతో భక్తులతో నదీ తీరాలు
కిటకిటలాడుతాయి. వివిధ సంస్కృతుల సమాగమంగా భారత్ లోని భిన్నత్వంలోని ఏకత్వం గోచరిస్తూ ఉంటుంది. భారతీయుల వైవిధ్యానికి ఇటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. అందుకే మేరా భారత్ మహాన్ అని ప్రతి భారతీయుడు గర్వపడతాడు.
ఇంతకీ కుంభమేళ జరిగే చోటు గురించి చెప్పుకోవాలి. బహుశా మీరు, మీ పెద్దలు, తెలిసిన వారు గతంలో జరిగిన కుంభమేళలో పాల్గొని ఉంటారు. ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళకు చాలా ప్రసిద్ధి ఉందని చెప్పే ఉంటారు. ఎందుకంటే ప్రయాగరాజ్ పుణ్య తీర్థాలైన గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమ ప్రాంతం, కనుక ఆ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంది.
ఇక తర్వాత ప్రసిద్ధ క్షేత్రం హరిద్వార్, హరిద్వార్ వద్ద ప్రవహించే గంగా నది చాలా తేటగా ఉంటుందని, పర్వతాల నుంచి నేరుగా వచ్చిన గంగమ్మ, హరిద్వార్ వద్ద జనావాసాల గుండా వెళుతుంది. కనుక ఇక్కడ గంగ నీరు ఇక్కడ తేటగా ఉంటుందని చెప్తారు. పైగా హరిద్వార్ హిమాలయాలకు చేరువులోనే ఉంటుంది. కనుక ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉంటుందని సాధకుల విశ్వాసం.
తదుపరి ప్రసిద్ధ క్షేత్రం నాసిక్. మహారాష్ట్రలోని గోదావరి నదీ తీర ప్రాంతం నాసిక్. గోదావరిని దక్షిణ గంగగా కీర్తిస్తారు. గోదావరి నది బంగాళ ఖాతంలో కలిసే వరకు దాని పరివాహక ప్రాంతంలోని అనేక పుణ్యక్షేత్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అన్ని భారతీయ హిందూ ధార్మిక విశ్వాసాలతో ముడిపడ్డ ప్రాంతాలే.
ఇక మధ్యప్రదేశ్ లోని ఉజ్జైని నాలుగో పుణ్యక్షేత్రం. క్షిప్రా నది తీరాన ఉన్న ఈ నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహ నక్షత్రాల గమన స్థానాలను బట్టి లెక్కించి కుంభమేళ జరపవలసిన ప్రదేశాన్ని నిర్ణయిస్తారు. బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ రావడానికి సుమారుగా 12 సంవత్సరాల సమయం పడుతుంది. అలా ఆ 12 ఏళ్ల బృహస్పతి గ్రహ భ్రమణ కాల వ్యవధుల్లో అది ఉన్న ప్రదేశాన్ని బట్టి ప్రతి 12 ఏళ్లకు ఒక్కో స్థానంలో కుంభమేళను నిర్వహిస్తారు.
గురుడు అంటే బృహస్పతి గ్రహం ఏ రాశిలో ఉన్నదాన్ని బట్టి కుంభమేళ జరిగే ప్రదేశం నిర్ణయించబడుతుందని పంచాంగ కర్తలు తెలియజేస్తున్నారు. హరిద్వార్లో కుంభమేళను గురుడు 11వ రాశి అయిన కుంభ రాశిలో ఉన్నప్పుడు జరుపుకుంటారు. అప్పుడు సూర్యుడు మేష రాశిలో ఉంటాడు. ప్రయాగరాజ్ లో కుంభమేళను గురుడు వృషభ రాశిలో ఉండి సూర్య చంద్రులు మకర రాశిలో ఉన్నప్పుడు జరుపుతారు.
నాసిక్ లో జరిపే కుంభమేళ గురుడు సూర్యుడు సింహ రాశిలో ఉన్నప్పుడు, ఉజ్జైనిలో జరిపే కుంభమేళ గురుడు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జరుపుతారు.
సూర్య, చంద్ర, బృహస్పతుల స్థానాలను బట్టి కుంభమేళ నిర్వహించి తిధులు నిర్ణయించబడతాయి. ఈ నిర్ధారిత ఖగోళ క్రమం ఏర్పడిన కాలంలో పర్యావరణంలో ఆధ్యాత్మిక శక్తి జాగృతం ఉంటుందని, ఆ కాలంలో ఆయా నదీ జలాలు అమృతతుల్యమై ఉంటాయని భక్తులు నమ్ముతారు. కనుకనే అప్పుడు ఆ నదీ జలాల్లో స్నానం ఆచరించి పునీతులం కావాలని భక్తులు తహతలాడుతూ ఉంటారు.
ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుపుతున్నట్లే, ఆరేళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళ కూడా నిర్వహిస్తారు. అయితే ఇవి హరిద్వార్ ప్రయాగరాజులకు మాత్రమే పరిమితం. 2019 లో ప్రయాగరాజ్ లో అర్ధ కుంభమేళ జరిగిందని చెప్పుకున్నాం కదా గుర్తుండే ఉంటుంది.
మీకు కూడా కుంభమేళా సమయంలో భక్తులు నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి, గంగా నదికి హారతులు ఇచ్చి, యాగాలు నిర్వహిస్తారు. దివంగతులైన తమ పూర్వీకులకు పిండ ప్రధానాలు చేస్తారు. వివిధ మఠాధిపతులు, సాధువులు వచ్చి పుణ్య ప్రవచనాలు ఇస్తారు. సనాతన భారతీయ హిందూ సాంప్రదాయ, ఆచార వ్యవహారాల వెనుక ఉన్న శాస్త్రీయత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువుల ద్వారా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అప్పుడు మనం చెప్పుకున్నట్టుగా యావత్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే ప్రదేశంలో చూసే అవకాశం అది.
ఐక్యరాజ్య సమితి విభాగమైన విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ యునెస్కో (UNESCO) భారతదేశంలో జరిగే కుంభమేళాని మానవత్వం యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వంగా కొనియాడింది. భక్తి విశ్వాసాలతో పాటుగా, ప్రజానికం చేసే యాత్రల మూలంగా రవాణా రంగానికి, నివాసం ఉంటారు కనుక ఆతిథ్య రంగానికి, ఆర్థికంగా బోలెడంత ఆదాయం సమకూరుతుంది. స్థానిక చేతి వృత్తుల ప్రదర్శనలు జరుగుతాయి కనుక వారి ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుంది. అమ్మకాలు జరుగుతాయి.
2019 లో జరిగిన కుంభమేళ కోసం ప్రభుత్వం 4236 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే వచ్చిన ఆదాయం 120 వేల కోట్లు. ఇక ఈ ఉత్సవం సందర్భంగా సుమారు 6 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. చేతి వృత్తుల వాళ్ళు హోటల్ల రంగం వారితో పాటుగా చిన్న పెద్ద వ్యాపారులందరికీ ఆర్జన పరంగా ప్రయోజనం ఉంటుంది, ఏడాదికి సరిపడా ఆదాయం వారికి ఈ కొద్ది రోజులు లోనే ఉంటుందన్నమాట,
అన్ని బాగానే ఉన్నాయి కదా అని అప్రమత్తంగా ఉండడం మాత్రం మర్చిపోకూడదు. భారీ ఏర్పాట్లు జరిగినప్పటికీ, సుమారుగా ఊహిస్తున్న 40 కోట్ల మంది యాత్రికులకు వసతి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రతి క్షణం ఒక సవాలుగా పని చేయాల్సి ఉంటుంది. జనసమర్ధంలో ప్రజలు తప్పిపోకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ జరగాలి. పారిశుద్యం, భద్రత, త్రాగునీరు, ఆహారం కోసం భారీ సన్నాహకాలు చాలా అవసరం కనుక అటు ప్రభుత్వ విభాగాలతో పాటుగా యాత్రికులు తొక్కిసలాడుకోకుండా జాగ్రత్తగా వెళ్లి రావాలి.
వీరందరి సౌకర్యార్థం 4000 హెక్టార్ల స్థలాన్ని కుంభమేళా కార్యక్రమాల కోసం ప్రభుత్వం కేటాయించింది. వాహనాలను నిలుపు చేసుకోవడానికి 1800 హెక్టార్ల స్థలాన్ని కేటాయించింది. CC టీవీ కెమెరాలు, సహాయ కేంద్రాలు, రోడ్ మ్యాప్ లు, అండర్ వాటర్ డ్రోన్లతో నిఘా సౌకర్యం వైద్య సదుపాయాలు, లక్షన్నర గుడారాలు, లక్షన్నర మరుగుదొడ్లు, స్నాల గదులు ఏర్పాటు చేశారు.
గ్రహ స్థితుల ఆధారంగా లెక్కించి చేసే ఈ సంవత్సరపు మహా కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రయాగరాజ్ లో జరుగుతుంది. కనుక ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ప్రకారం చూసిన అధిక జనం ఒకే చోటన గుమిగూడతారు. కనుక కలరా వంటి వ్యాధులు సోకకుండా ప్రభుత్వ యంత్రాంగం, యాత్రికులు జాగ్రత్త పడాలి. కనుకనే తాత్కాలికంగా మహా కుంభమేళ పేరుతో ఒక జిల్లాని సైతం ఏర్పాటు చేశారు. చిరస్మరణీయమైన కుంభమేళ అనుభవాన్ని ఆస్వాదించాలంటే, భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చిరకాల జ్ఞాపకంగా చేసుకుంటూ ఉండాలంటే, అందరూ తగు జాగ్రత్తలతో ఉండడం తప్పనిసరి అని మాత్రం మర్చిపోకూడదు.
భారతదేశం వంటి పుణ్యభూమిని సందర్శించే బంగారు అవకాశం ఇది. దీన్ని మంచి అనుభూతిగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకోండి. సనాతన భారతీయ విశ్వాసాలు, ప్రకృతితో ఆధ్యాత్మిక ఔన్నత్యంతో పూలలో దారం జన జీవితాలతో పెనవేసుకుని ఉన్నాయని మాత్రం గ్రహించండి.