America’s Railway Network: From Yesterday’s Number One to Today’s Situation

America's Railway Network

America’s Railway Network: From Yesterday’s Number One to Today’s Situation -అమెరికా రైల్వే నెట్వర్క్: ఓ నాటి నెంబర్ వన్ నుండి నేటి పరిస్థితి

ఒకప్పుడు రెండు లక్షల కిలోమీటర్ల పొడుగు ఉండే అమెరికా రైల్ నెట్వర్క్ ప్రపంచంలోనే నెంబర్ వన్. మిగిలిన ప్రపంచంలో ఉన్న రైల్వే నెట్వర్క్ మొత్తం కూడిన అమెరికా కన్నా తక్కువగా ఉండేది. మీరు కౌ బాయ్ సినిమాలు చూసుంటారు కదా, మారుమూల గ్రామాలకు కూడా రైళ్లు వస్తాయి. రైళ్లు, గుర్రాలే ఆ రోజుల్లో ప్రధాన రవాణా వ్యవస్థ. 

కానీ ఈరోజు మహానగరాలలో తప్పితే అమెరికాలో రైలు ప్రయాణం చాలా తక్కువ. అమెరికన్లు చాలా వరకు కార్లలో, విమానాల్లో ప్రయాణం చేస్తారు. అమెరికాలోని రైలు వ్యవస్థ ఎటు మాయమైంది ? అమెరికన్లు యూరోప్ లోని రైల్ వ్యవస్థ చూసి అబ్బుర పడుతుంటారు. కానీ చాలా మంది అమెరికన్లకు కూడా తెలియదు వాళ్ళు ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ అని. 

1865 లో అమెరికాలో 50000 కిలోమీటర్ల ప్రైవేట్ రైల్ ట్రాక్ ఉండేది. యూనియన్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్ అనే రెండు ప్రైవేట్ సంస్థలు రైళ్లను నడిపాయి. పదేళ్లలో ప్రైవేట్ రైల్ ట్రాక్ లు 120 వేల కిలోమీటర్లు అయ్యాయి. ఇంకో పదేళ్లలో అంటే 1800-85 కల్లా రెండు లక్షల కిలోమీటర్లు అయ్యాయి. 1890 కల్లా దేశ వ్యాప్తంగా 1000 ప్రైవేట్ రైల్ రోడ్ కంపెనీలు వచ్చాయి. 

ఈ కంపెనీలు మహానగరాల నుంచి కుగ్రామాల వరకు విస్తృత రైల్ నెట్వర్క్ నిర్మించాయి. ఇన్ని కంపెనీలు అయ్యేసరికి పోటీ తార స్థాయిలో ఉండేది. చార్జీలు చాలా తక్కువగా ఉండేవి. రైలు కంపెనీలు లాభాలు అర్జించడానికి నానా తంటాలు పడేవి. న్యూయార్క్ నుంచి చికాగో వంటి దూరాబార మార్గాల్లో ప్రయాణికుల రద్ది బాగా ఎక్కువగా ఉండి, చార్జీలు తక్కువగా ఉండేది. కానీ రద్దీ తక్కువ ఉండి, దగ్గర ఉండే హారిస్బర్గ్, పిట్స్బర్గ్ వంటి నగరాలకు చార్జీలు ఎక్కువగా ఉండేవి.

ఈ ధరల అన్యాయంపై ఉద్యమకారులు ప్రశ్నలు లేవదీశారు. ఉద్యమకారులు తక్కువ ధరల గురించి అభ్యంతరం చెప్పేవారు కాదు కానీ, దగ్గర ప్రాంతాలకు ఎక్కువ ధరలను చూపి ప్రైవేట్ దోపిడి అని గగ్గోలు పెట్టేవారు. 

1870 లలో రైల్వేల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా గ్రేజ్ ఉద్యమం వచ్చింది. దోపిడి చార్జీలను ప్రభుత్వం నియంత్రించాలి అని డిమాండ్ చేశారు. వాళ్లకు మద్దతుగా గ్రీన్ బ్యాక్ పార్టీ, రైతు సమాఖ్యలు కూడా నిలబడ్డాయి. పాపులిస్ట్ పార్టీ నాయకుడు విలియం జెన్నింగ్స్ బ్రాయన్ ఏకంగా రైల్వేలను జాతీయం చేయాలి అని డిమాండ్ చేశాడు. 

వింత ఏంటంటే పోటీతో సతమవుతున్న రైల్ కంపెనీ యాజమాన్యాలకు కూడా టికెట్ల నియంత్రణలో స్వలాభం కనిపించింది. ప్రభుత్వం రేట్లు నియంత్రిస్తే ఈ పోటీ ఇబ్బంది నుంచి బయట పడవచ్చని ఆశించాయి. సంఘ సంస్కర్తలు ప్రజలు కంపెనీలు పార్టీలు పాలకులు ప్రభుత్వ నియంత్రణకు సుముఖంగా ఉండటంతో 1887 లో ఇంటర్ స్టేట్ కామర్స్ కమిషన్ ఐ సిసి (ICC) ఆవిర్భవించింది.

ఈ సంస్థకు రైలు కంపెనీల మీద సంపూర్ణ నియంత్రణ అధికారాలు రావడానికి పదేళ్లు పట్టింది. ఈ లోపు ఉద్యమకారులందరూ వేరే సామాజిక ఉద్యమాలలో బిజీ అయిపోయారు. ఇంకేముంది రైలు కంపెనీలు ఐసీసి నిండా తమ ఉద్యోగులను చేర్చారు. మొదటి ఐసీసి కమిషనర్ రైల్వే కంపెనీల లాయర్ థామస్ కూలీ అయ్యారు.నగరాల అధిక చార్జీల సమస్యను కమిషన్ అవలీలుగా పరిష్కరించింది. దూరభారం నగరాల మధ్య చార్జీలను భారీగా పెంచేసింది. ఇంకేముంది రైలు కంపెనీలకి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించే అవకాశం దొరికింది.

రైలు కంపెనీలలో పనిచేసేవాళ్ళు ఐసీసి ఉద్యోగులు అయ్యేవారు. ఐసీసి లో పనిచేసి బయటికి వచ్చిన వాళ్ళకి మంచి జీతాలతో మళ్ళీ రైలు కంపెనీలో ఉద్యోగం పొందేవారు. కానీ ఈ పోటీ లేని వాతావరణంలో రైలు కంపెనీలు అసమర్థం అయ్యాయి. 

రైల్లో సరుకు రవాణా ధరలు పెరగడంతో రోడ్ల మీద నడిచే ట్రక్కుల నుంచి పోటీ వచ్చింది. రైలు టికెట్లు ధరలు పెరగడంతో అమెరికాలో కార్ల వాడకం పెరిగింది. దానికి తోడు విమానయానం కూడా మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన అధిక ధరలకు అలవాటు పడ్డ రైలు కంపెనీలు, ట్రక్కులు, కార్లు విమానాల పోటీని తట్టుకోలేకపోయాయి. విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయాయి.చాలా రైల్ కంపెనీలు మూతపడ్డాయి. 

1971 లో అమెరికా ప్రభుత్వం నేషనల్ రైల్ రోడ్ ప్యాసెంజర్ కార్పొరేషన్ స్థాపించింది. దాన్నే యామ్ ట్రాక్ అంటారు. 100 ఏళ్ల క్రితం పాపులస్ట్ పార్టీ నాయకుడు విలియం జెనింగ్స్ బ్రాయన్ డిమాండ్ చేసినట్లు, అమెరికా ప్రైవేట్ రైల్ వ్యవస్థ మొత్తం జాతీయం అయిపోయింది. ప్రైవేట్ రైల్ కంపెనీ అన్నీ తమ ప్యాసెంజర్ రవాణా వ్యాపారాన్ని యామ్ ట్రాక్ కి అప్పజెప్పి చేతులు దులుపుకున్నాయి. 

జాతీయం చేయబడ్డ యామ్ ట్రాక్ ప్రభుత్వ రైల్ సంస్థ ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల లాగానే బయట పడలేనంత లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది.ఇప్పటికే అమెరికా ప్రభుత్వం 50 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ప్రజాధనాన్ని ఈ సంస్థ నష్టాలు పూరించడానికి వెచ్చించారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైలు వ్యవస్థ ఇలా విధ్వంసం అవ్వటంలో అందరూ సూత్రదారులే. అందరూ నేరస్తులే. కానీ అందరికన్నా ఎక్కువ నష్టపోయింది ప్రజలు. అతి పెద్ద రైలు నెట్వర్క్ అందించే చవక ప్రయాణ వ్యవస్థ దివాలా తీయడమే కాకుండా ప్రజల 50 బిలియన్ డాలర్ల కష్టార్జితాన్ని యామ్ ట్రాక్ మీద ఇప్పటికే  వెచ్చించారు. అమెరికా ప్రభుత్వం ఇంకా ఖర్చుపెడుతూనే ఉంది. 

ఫ్రీ మార్కెట్ చూడటానికి చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ ఆ పోటీ ప్రపంచం నుంచే తక్కువ ధరలు, ఎక్కువ నాణ్యత ఉన్న వస్తువులు సేవలు వస్తాయి. ప్రభుత్వ జోక్యం నియంత్రణల వలన లాభం తక్కువ, నష్టం ఎక్కువ. అమెరికా రైల్వేలను నియంత్రించడానికి తెచ్చిన ఇంటర్ స్టేట్ కామర్స్ కమిషన్ మొత్తం రైల్వే వ్యవస్థనే నాశనం చేసేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *